న్యూఢిల్లీ: దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ నివారణలో భారత్ చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన క్యూడెంగా (QDENGA) వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్కెట్ అనుమతిని మంజూరు చేసింది. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది.
డెంగీకి కారణమయ్యే 4 రకాల వైరస్ల నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు వారు ఈ టీకా వేసుకోవచ్చు. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు లేకుండానే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 0.5 ఎంఎల్ చొప్పున మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా భారత్‌లో ఆమోదం పొందిన క్యూడెంగా వ్యాక్సిన్ ఆసియా ఖండంలోని 43 దేశాల్లో ఇప్పటికే ఆమోదం పొందింది. క్లినికల్ ట్రయల్స్‌లో డెంగ్యూ వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితిని 84.1% వరకు ఈ వ్యాక్సిన్ నిరోధించినట్లు తేలింది.
భారతదేశంలో డెంగ్యూ ఏటా తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే డెంగ్యూ కేసుల్లో దాదాపు మూడో వంతు కేసులు ఒక్క ఇండియాలోనే నమోదు అవుతున్నాయని అంచనా. 2025లో సుమారు లక్షకు పైగా కేసులు నమోదు కాగా.. నమోదు కాని సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందనేది సమాచారం. ఈ తరుణంలో దేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో భారత్‌లో డెంగ్యూ నివారణలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడినట్లు అయ్యింది.
